మోదీ పై విరుచుకుపడ్డ రాహుల్

0
59

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రఫేల్‌ వ్యవహారంపై పార్లమెంటు హాల్ లో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రఫేల్‌పై సమాధానం ఇచ్చేందుకు ప్రధాని మోదీకి ధైర్యం లేదని, అందుకే ఆయన తన గదిలో ఉండిపోయారని రాహుల్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘పార్లమెంటుకు వచ్చి రఫేల్‌పై సమాధానం చెప్పేందుకు ప్రధాన మంత్రికి ధైర్యం చాలడం లేదు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా సభలో అన్నా డీఎంకే ఎంపీల వెనుక దాక్కున్నారు. రఫేల్‌ ఒప్పందంలో చాలా లొసుగులు ఉన్నాయి. గతం లో ఈ విషయంపై నెను ప్రశ్నించినపుడు కూడా ప్రధాని ఐదు నిమిషాలే స్పందించారు.’’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. రఫేల్‌ జెట్‌ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు అప్పటి రక్షణ మంత్రి, ప్రస్తుత గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ బెడ్‌ రూంలో ఉన్నాయన్న గోవా మంత్రి వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో టేపులను సభలో వినిపించాలని రాహుల్‌ పట్టుబట్టారు. ఆడియో టేపులు ఉన్నట్లు మీరు నమ్ముతున్నారా..? అని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ రాహుల్‌ను ప్రశ్నించారు. మరోవైపు అరుణ్‌ జైట్లీ సైతం ఆడియో టేపులు నిజమని నిరూపించగలరా? అని సవాలు విసిరారు. ఈ క్రమంలోనే కొంత సేపు సభలో వాడి వేడిగా చర్చ జరిగింది.

సభ తొలుత 2.30కు వాయిదా పడింది. అనంతరం సభ పునఃప్రారంభమయ్యాక రఫేల్‌ అంశంపై రాహుల్‌ సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)వేయాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు కూడా రఫేల్‌ విచారణ వ్యవహారం తమ పరిధిలోకి రాదని చెప్పింది కానీ, జేపీసీ ఏర్పాటు చేయకూడదని ఎక్కడా అనలేదని రాహుల్‌ గుర్తు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here